టీమిండియా-దక్షిణాఫ్రికా టెస్టుకు వర్షం అంతరాయం... ముగిసిన తొలి రోజు ఆట

  • సెంచురియన్ లో తొలి టెస్టు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 208 పరుగులు చేసిన టీమిండియా
  • వర్షం కురవడంతో నిలిచిన మ్యాచ్
  • 70 పరుగులతో క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచురియన్ లో నేడు ప్రారంభమైన తొలి టెస్టుకు వరుణుడు అడ్డం తగిలాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అతికష్టమ్మీద 200 పరుగుల మార్కు దాటింది. అప్పటికే 8 వికెట్లు కోల్పోయింది. 

ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు 8 వికెట్లకు 208 పరుగులు కాగా... ఈ దశలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. క్రీజులో కేఎల్ రాహుల్, సిరాజ్ ఉన్నారు. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో తొలి రోజు ఆట రద్దయింది.

ఇతర బ్యాట్స్ మెన్ ఎంతో ఇబ్బందిపడిన ఈ పిచ్ పై కేఎల్ రాహుల్ ఓపికతో బ్యాటింగ్ చేశాడు. రాహుల్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 70 పరుగులతో ఆడుతున్నాడు. శార్దూల్ ఠాకూర్ (24) నుంచి అతడికి మంచి సహకారం లభించింది. కోహ్లీ 38, శ్రేయాస్ అయ్యర్ 31 పరుగులు చేశారు. 

దక్షిణాఫ్రికా పేసర్లు సొంతగడ్డపై చెలరేగారు. ముఖ్యంగా, కగిసో రబాడా నిప్పులు చెరిగే బంతులకు టీమిండియా లైనప్ దాసోహం అంది. రబాడా 17 ఓవర్లలో 44 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. నాండ్రే బర్గర్ 2, మార్కో యన్సెన్ 1 వికెట్ తీశారు.


More Telugu News