కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

  • లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని వెల్లడి
  • ఆశావహుల డేటా సేకరణ కోసమే దరఖాస్తుల స్వీకరణ అన్న మంత్రి
  • అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న శ్రీధర్ బాబు
కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 'ప్రజాపాలన' నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు. ప్రజాపాలన సందర్భంగా స్వీకరించే దరఖాస్తులను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కొత్త రేషన్ కార్డులు చేర్చడం లేదా పాత రేషన్ కార్డులు తీసేయడం చేయలేదన్నారు.

అయితే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని శ్రీధర్ బాబు తెలిపారు. లబ్ధిదారులు ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని వెల్లడించారు. ఆశావహుల డేటా సేకరణ కోసం మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ విషయమై స్పందిస్తూ... ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నవారు మరోసారి దరఖాస్తు చేసుకోవద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పరిశీలించి.. అర్హులైన నిరుపేదలకు ఇస్తామని తెలిపారు. ప్రజావాణిలో ఇప్పటి వరకు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.


More Telugu News