ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లపై రెండేళ్ల నిషేధం

  • ముజీబుర్ రెహ్మాన్, నవీనుల్ హక్, ఫజల్ హక్ ఫరూఖీలపై నిషేధం
  • జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ చర్యలు
  • ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం 
గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు విశేషంగా రాణిస్తోంది. ఇటీవల వరల్డ్ కప్ లోనూ త్రుటిలో సెమీస్ చాన్సు కోల్పోయింది. అయితేనేం, పలు అగ్రశ్రేణి జట్లను ఓడించి, తనను తక్కువగా అంచనా వేయొద్దని బలమైన సంకేతాలు పంపింది. 

ఆ జట్టులో రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, హష్మతుల్లా షాహిది, రహ్మనుల్లా గుర్బాజ్, నవీనుల్ హక్ వంటి క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్ ల్లో ఆడుతూ ఎంతో గుర్తింపు పొందారు. అయితే, జాతీయ జట్టుకు ఆడడం కంటే విదేశీ లీగ్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ముగ్గురు జాతీయ క్రికెటర్లపై నిషేధం విధించింది. 

ఫజల్ హక్ ఫారూఖీ, నవీనుల్ హక్, ముజీబుర్ రెహ్మాన్ లు రెండేళ్ల పాటు ఏ విదేశీ లీగ్ లలోనూ ఆడుకుండా నిషేధం విధించింది. గతంలో వారికి ఇచ్చిన ఎన్ఓసీని కూడా రద్దు చేసింది. అంతేకాకుండా, ఏడాది పాటు వారికి సెంట్రల్ కాంట్రాక్టును నిరాకరించింది. 

కాగా, ఈ ముగ్గురిలో ఒకరైన ఫజల్ హక్ ఫరూఖీ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా... నవీనుల్ హక్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్నాడు. ముజీబుర్ రెహ్మాన్ తాజా సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఎంపికయ్యాడు. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు నిషేధం నేపథ్యంలో, ఈ ముగ్గురు ఐపీఎల్ తాజా సీజన్ లో ఆడే అవకాశాలు కనిపించడంలేదు.


More Telugu News