​టీటీడీ పాలకమండలి తాజా నిర్ణయాలు ఇవిగో!

  • భూమన అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • పోటు కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు
  • టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న ఇంటి పట్టాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి నేడు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇవాళ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో... శ్రీవారి ప్రసాదం పోటు కార్మికుల వేతనాల పెంపు, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

టీటీడీ నిర్ణయాలు ఇవిగో....

  • శ్రీవారి ప్రసాదం పోటు కార్మికుల వేతనం రూ.10 వేల మేర పెంపు. ఇప్పటివరకు పోటు కార్మికుల వేతనం రూ.28 వేలు... ఇకపై అది రూ.38 వేలు కానుంది
  • 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న ఇళ్ల స్థలాల పట్టాల అందజేత. జనవరిలో మరో 1,500 మందికి ఇంటి పట్టాలు
  • రిటైర్డ్ ఉద్యోగులకోసం ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేయాలని నిర్ణయం. రూ.85 కోట్లతో 350 ఎకరాలు కొనుగోలు చేయనున్న టీటీడీ
  • పారిశుద్ధ్య విభాగంలో వర్క్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపునకు నిర్ణయం
  • ఉగ్రాణం కార్మికులు, వాహన బేరర్లను నైపుణ్య పనివారుగా గుర్తించి ఆ మేరకు వేతనాల పెంపు
  • ప్రతి ఏటా పెద్ద జీయర్ మఠానికి ఇచ్చే ప్యాకేజీ రూ.2 కోట్ల నుంచి రూ.2.60 కోట్లకు పెంపు
  • ప్రతి ఏటా చిన్న జీయర్ మఠానికి ఇచ్చే ప్యాకేజీ రూ.1.70 కోట్ల నుంచి రూ.2.10 కోట్లకు పెంపు
  • తిరుమల కల్యాణకట్టలో పీస్ రేట్ ప్రాతిపదికన పనిచేస్తున్న క్షురకుల కనీసం వేతనం రూ.20 వేలకు పెంపు
  • శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం చేసే భక్తులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని నిర్ణయం
  • తిరుపతిలో పాత సత్రాల స్థానంలో కొత్త వసతి గృహ సముదాయాల నిర్మాణం టెండర్లకు ఆమోదం
  • ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం 
  • రూ.14.5 కోట్లతో గోగర్భం డ్యామ్ వద్ద క్యూలైన్ నిర్మాణానికి టెండర్ ఆమోదం



More Telugu News