పాకిస్థాన్ ఎన్నికల్లో హిందూ మహిళ పోటీ.. నామినేషన్ దాఖలు

  • ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వాలోని బునెర్‌ జిల్లాలో జనరల్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన నవీరా ప్రకాశ్
  • పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న మొట్టమొదటి హిందూ మహిళగా రికార్డు
  • పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరపున నామినేషన్ పత్రాలు సమర్పించిన నవీరా
దాయాది దేశం పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికలు-2024లో మొట్టమొదటిసారి ఓ హిందూ మహిళ బరిలో నిలవబోతోంది. ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వాలోని బునెర్‌ జిల్లాలో ఒక జనరల్ సీటు నుంచి పోటీ చేసేందుకు సవీరా ప్రకాష్ అనే హిందూ మహిళ నామినేషన్‌ దాఖలు చేశారు. బునెర్ జిల్లాలోని పీకే-25 జనరల్ సీటుకు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరపున ఆమె అధికారికంగా నామినేషన్ పత్రాలను సమర్పించారని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.

కాగా సవీరా ప్రకాశ్ తన తండ్రి ఓమ్ ప్రకాశ్ అడుగు జాడల్లో నడుస్తున్నారు. డాక్టర్‌గా ఇటీవలే పదవీ విరమణ చేసిన ఓమ్ ప్రకాశ్ గత 35 ఏళ్లుగా పీపీపీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. దీంతో తండ్రి మాదిరిగా ప్రజాసేవ చేయాలని సవీరా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆమె ఆశాభావంతో ఉన్నారు. బునెర్ జిల్లాలో పోటీ చేస్తున్న మొట్టమొదటి మహిళ సవీరా ప్రకాశ్ అని స్థానిక రాజకీయ నాయకుడు సలీమ్ ఖాన్ పేర్కొన్నట్టు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. 

కాగా సవీరా ప్రకాశ్ అబోటాబాద్‌లోని ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో 2022 గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం బునెర్‌ జిల్లా పీపీపీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారు. మహిళా సాధికారత, భద్రత, మహిళ హక్కుల కోసం ఆమె తన గళాన్ని వినిపిస్తున్నారు. అభివృద్ధిలో మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారని, అణచివేతకు గురిచేస్తున్నారని ఆమె నొక్కి చెబుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె చెబుతున్నారు. కాగా పాకిస్థాన్‌లో 16వ నేషనల్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8, 2024న జరగనున్నాయి.


More Telugu News