నవజాత శిశువును బస్టాండ్ పబ్లిక్ వాష్‌రూమ్‌లో వదిలిపెట్టిన తల్లిదండ్రులు !

  • ఏడు రోజుల శిశువుని వదిలించుకునేందుకు ప్రయత్నించిన దంపతులు
  • చండీగఢ్‌లో రెండు రోజులక్రితం వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు
చండీగఢ్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఏడు రోజుల పసికందును గుర్తుతెలియని జంట పబ్లిక్ వాష్‌రూమ్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయింది. రెండు రోజులక్రితం వెలుగుచూసిన ఈ ఘటనలో నిందితులపై కేసు నమోదయింది. చండీగఢ్‌లో సెక్టార్ 43లో ఉన్న ఇంటర్-స్టేట్ బస్ టెర్మినస్ (ఐఎస్‌బీటీ) వద్ద శిశువు ఏడుపును వాష్‌రూమ్‌లో పనిచేస్తున్న స్వీపర్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుర్తుతెలియని జంటపై ఐపీసీ సెక్షన్ 317 కింద కేసు పెట్టారు. 12 ఏళ్లలోపు పిల్లలను తల్లిదండ్రులు వదిలిస్తే ఈ సెక్షన్ కింద అభియోగాలు మోపుతారు. శిశువుని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా నిందిత దంపతులు శిశువును తీసుకొని బస్ టెర్మినస్‌లోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు. వాష్‌రూమ్‌లో శిశువుని వదిలి అక్కడి నుంచి పరిగెత్తుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయని వెల్లడించారు. నిందిత దంపతులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ దిశగా వెళ్లినట్టు అనుమానిస్తున్నామని, ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉందన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.


More Telugu News