ఏపీలో పరిశ్రమలు పెట్టాలని వస్తే కమీషన్లు అడుగుతున్నారు: టీడీపీ ఎంపీ కనకమేడల ఆరోపణ

  • జగన్ వచ్చాక రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయని ఆరోపణ
  • పరిశ్రమలలో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్న కనకమేడల 
  • పరిశ్రమలలో వాటాలు పొందడంపైనే శ్రద్ధ పెడుతున్నారని విమర్శలు
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు వచ్చే వారిని కమీషన్ల కోసం పీడిస్తున్నారని ప్రభుత్వంపై తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. పరిశ్రమలలో 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో పారిశ్రామికవేత్తలు వెనుదిరుగుతున్నారని చెప్పారు. ఏపీలో జగన్ సర్కారు ఏర్పడ్డాక రాజకీయ కక్ష సాధింపు చర్యలు విపరీతంగా పెరిగాయని అన్నారు. పరిశ్రమలలో వాటా ఇవ్వకుంటే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, పారిశ్రామికవేత్తల ఇళ్లు, ఆఫీసులపై ప్రభుత్వ యంత్రాంగంతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి విధానాల వల్ల ఏపీలో నిరుద్యోగిత పెరిగిపోయిందని ఎంపీ కనకమేడల ఆరోపించారు. అమరరాజా కంపెనీ మహబూబ్ నగర్ కు తరలిపోవడానికి కారణమేంటనేది అందరికీ తెలుసని చెప్పారు. జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతో అమరరాజా బ్యాటరీ కంపెనీ అధినేత జయదేవ్ గల్లా తన కొత్త కంపెనీని తెలంగాణలో పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ కంపెనీ మన రాష్ట్రంలో పెడితే సుమారు లక్ష మందికి ఉద్యోగాలు లభించేవని ఎంపీ కనకమేడల చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు.. ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలను పెట్టుబడులు పెట్టకుండా ఇలాంటి చర్యలతో అడ్డుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు. ఈ రకమైన విధ్వంసకర పాలన వల్లే రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని చెప్పారు.


More Telugu News