చంద్రబాబుతో ముగిసిన ప్రశాంత్ కిశోర్ సమావేశం... వైసీపీ సర్కారుపై లోతైన విశ్లేషణతో నివేదిక!

  • టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ సమావేశం
  • 3 గంటల పాటు సాగిన భేటీ
  • ప్రభుత్వ బలాబలాలపై నివేదిక అందించిన ప్రశాంత్ కిశోర్!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం 3 గంటల పాటు సాగింది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో ప్రశాంత్ కిశోర్ ఓ నివేదికను చంద్రబాబుకు అందించినట్టు తెలిసింది.

రాష్ట్ర యువతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని... ధరల పెంపు, కరెంటు చార్జీల పెంపు, పన్నులు, నిరుద్యోగం తదితర అంశాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆ నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. దళితులు, బీసీలపై దాడులు వైసీపీకి ప్రతికూలంగా మారాయని... బీసీలు, దళితులను వైసీపీకి దూరం చేశాయని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 

ఎవరో ఒకరిద్దరు మంత్రులను మినహాయిస్తే, మిగతా మంత్రులకు సున్నా మార్కులు పడతాయి... ప్రభుత్వానిది అహంకార ధోరణి అనే భావన ప్రజల్లో నెలకొంది... పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షం తగిన వ్యూహ రచన చేసుకోవాలి, యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలి.... ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి... చంద్రబాబు అరెస్ట్ కారణంగా... తటస్థంగా ఉండేవారిలోనూ, వైసీపీ వర్గాలోనూ జగన్ పై వ్యతిరేకత వచ్చింది... అంటూ ఆ నివేదికలో వివరించినట్టు సమాచారం.


More Telugu News