ఎంత అభివృద్ధి చేశామన్నదే ముఖ్యం.. పదవులు శాశ్వతం కాదు: జగదీశ్ రెడ్డి
- ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేయాలన్న జగదీశ్ రెడ్డి
- అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామని వ్యాఖ్య
- ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకపోతే పోరాటాలకు దిగుతామని హెచ్చరిక
రాష్ట్రాన్ని ఎంత అభివృద్ది చేశామన్నదే ముఖ్యమని... పదవులు శాశ్వతం కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు పల్లెలు, పట్టణాలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో చెప్పడానికి అధికారులే సాక్ష్యమని చెప్పారు. ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేయాలని, భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలబడాలని అన్నారు. తమ పాలనలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేశామని... కాంగ్రెస్ పాలనలో అదే కొనసాగాలని ఆశిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతామని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోతే అవసరమైతే పోరాటాలకు కూడా దిగుతామని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం పెన్ పహాడ్ మండల కేంద్రంలో నిర్వహించి మండల సర్వసభ్య సమావేశంలో జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.