వెంకటేశ్వరస్వామి ఆలయంపై రాజకీయం చేయవద్దు: గండ్ర వెంకటరమణారెడ్డి
- ఈ ఆలయం రాత్రికి రాత్రి నిర్మించింది కాదన్న గండ్ర
- జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య శంకుస్థాపన చేసినట్లు వెల్లడి
- గుడి పూర్తయ్యాక.. పనులు ఆపాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమని ఆరోపణ
భూపాలపల్లిలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయం రాత్రికి రాత్రి నిర్మించింది కాదని... జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య శంకుస్థాపన జరిగిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలో ప్రజల కోసం, లోక కల్యాణార్థం నిర్మించిన వెంకటేశ్వరస్వామి ఆలయంపై రాజకీయం చేయడం సరికాదన్నారు. ఈ గుడి నిర్మాణం పూర్తయిందన్నారు. ఆలయం పక్కనే అర్చకులకు, సూపర్ వైజర్లకు, వంట మనుషులకు, దేవుని సామగ్రి భద్రపరచడం కోసం, భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం గదులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ఇప్పుడు గుడి పనులను ఆపడం, నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమే అని ఆరోపించారు. ప్రజలంతా దీనిని గమనిస్తున్నారని గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు.