‘పద్మశ్రీ’ని ప్రధాని నివాసం వద్ద వదిలిపెట్టేసిన ప్రముఖ రెజ్లర్

  • డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికపై రెజ్లర్‌ల నిరసనలు
  • తన పద్మశ్రీని ప్రధాని నివాసం వద్ద వదిలిపెట్టేసిన ఒలింపిక్ మెడలిస్ట్ బజ్‌రంగ్ పునియా
  • తన సోదరీమణులకు న్యాయం చేయలేని తాను ఈ మెడల్‌కు అనర్హుణ్ణని వ్యాఖ్య  
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ నియామకంపై నిరసన కొనసాగుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు నమ్మకస్తుడిగా పేరుపడ్డ సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడాన్ని రెజర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ మెడలిస్ట్ బజ్‌రంగ్ పూనియా కూడా తన నిరసన వ్యక్తం చేశారు. తన పద్మశ్రీ పతకాన్ని కర్తవ్యపథ్‌లోని ప్రధాని నివాసం సమీపంలో వదిలిపెట్టి వచ్చారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళలకు న్యాయం చేయలేకపోయిన తాను ఈ మెడల్‌కు అర్హుడిని కానన్నారు. 

‘‘నేను గతంలో చెప్పినట్టు మేము మా సోదరీమణులు, కూతుళ్ల కోసం పోరాడుతున్నాం. వారికి నేను న్యాయం చేయలేకపోయాను. కాబట్టి, ఈ గౌరవానికి నేను అర్హుడిని కాను. ఈ అవార్డును తిరిగిచ్చేందుకు నేను ఇక్కడికి వచ్చాను. అయితే, ప్రధాని బిజీ షెడ్యూల్ కారణంగా ఆయనను కలవలేకపోయాను. ప్రధానికి రాసిన లేఖతో పాటూ మెడల్‌ను కూడా ఇక్కడే వదిలేశాను. దాన్ని వెంట తీసుకెళ్లట్లేదు’’ అని పునియా విలేకరులతో అన్నారు. 


More Telugu News