ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసులు

  • ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై జనవరి 3న విచారణకు రావాలన్న ఈడీ
  • గతంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరుకాని ఢిల్లీ ముఖ్యమంత్రి
  • ఈసారి ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 3న విచారణకు రావాలని కోరింది. కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో రెండు పర్యాయాలూ ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీంతో, ఈసారి కేజ్రీవాల్ ఏం చేయబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఈడీ తొలుత నవంబర్ 2న విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు నోటీసులు పంపించింది. అయితే, మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఆయన వెళ్లలేదు. డిసెంబర్ 21న కూడా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ఈడీని ప్రయోగిస్తున్నారంటూ ఆయన అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News