జనవరి 6న ఎల్1 పాయింట్‌లోకి ఆదిత్య ఎల్1 మిషన్ ప్రవేశం: ఇస్రో చైర్మన్ సోమనాథ్

  • కచ్చితమైన సమయాన్ని నిర్దిష్ట సమయంలో చెబుతామన్న ఇస్రో చీఫ్
  • ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024’లో పాల్గొన్న సోమనాథ్
  • సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్1ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆదిత్య ఎల్1 మిషన్ జనవరి 6న సూర్యుడికి దగ్గరగా ఉండే ఎల్1 పాయింట్‌లోకి (లాంగ్రేజ్ పాయింట్) ప్రవేశిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు అంచనా వేశామని, కచ్చితమైన సమయాన్ని నిర్దిష్ట సమయంలో ప్రకటిస్తామని చెప్పారు. గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆదిత్య ఎల్1 మిషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయన పంచుకున్నారు.

కాగా ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సోమనాథ్.. ఆదిత్య ఎల్1 మిషన్ జనవరి 7న ఎల్1 పాయింట్‌లో ప్రవేశిస్తుందన్న అంచనాను వెల్లడించారు. భారత్ తొలి సౌండింగ్ రాకెట్ ప్రయోగించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూర్యుడిపై అధ్యయనానికి భారత్ చేపట్టిన మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత మిషన్ ‘ఆదిత్య ఎల్ 1 అంతరిక్ష నౌక’ చివరి దశకు చేరుకుందని అన్నారు. ఎల్1 పాయింట్‌లోకి స్పేస్‌క్రాఫ్ట్ ప్రవేశానికి ప్రస్తుతం చివరి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆదిత్య ఎల్1 మిషన్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించారు. 125 రోజుల పాటు సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఎల్1 లో ప్రవేశించడానికి సిద్ధమైంది.


More Telugu News