స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు గాయం!

  • దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో చీలమండ గాయానికి గురైన సూర్య
  • బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేసిన స్టార్ బ్యాట్స్‌మెన్
  • వచ్చే నెలలో జరగనున్న ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కూ దూరమైన సూర్య
టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. కీలకమైన ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్నారు. ఇప్పటికే పేసర్ మహ్మద్ షమీ, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్ గాయాల బారిన పడగా తాజాగా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చీలమండ గాయమైందని రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో వచ్చే నెలలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు అతడు దూరమవనున్నాడని తెలుస్తోంది. డిసెంబర్ 14న దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ గాయపడ్డాడని, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్ట్ చేశాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ సమయానికి తిరిగి కోలుకునే అవకాశం ఉందని, వేసవిలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశంలేదని తెలిపాయి.

గాయంపై సూర్య ఎన్‌సీఏకి రిపోర్ట్ చేశాడని, మెడికల్ టీమ్ అతడు గాయపడినట్లు నిర్ధారించిందని బీసీసీఐ వర్గాలు వివరించాయి. జనవరిలో జరిగే ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌ ఆడలేడని, టెస్టులకు ఎంపికయ్యే అవకాశం లేదని, ఫిబ్రవరిలో జరిగే రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడవచ్చని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. ఐపీఎల్‌లో ఆడడానికి ముందు అతడి ఫిట్‌నెస్‌ను పరిశీలించాల్సి ఉందని వెల్లడించారు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఆఫ్ఘనిస్థాన్‌పై టీ20 సిరీస్‌కి అందుబాటులోకి ఉంటాడా లేదా అనేది సందేహంగా మారింది. పాండ్యా ఫిట్‌నెస్‌పై ప్రస్తుతానికి ఎలాంటి అప్‌డేట్ లేదని, ఐపీఎల్‌కు ముందు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడతాడని భావించడంలేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.


More Telugu News