సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపు

  • ఎన్నికల్లో ఆత్మసాక్షిగా ఓటు వేసి టీబీజీకేఎస్‌ను గెలిపించాలన్న కవిత
  • సింగరేణిని కేసీఆర్ కాపాడారన్న కవిత
  • డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి.. ఉపాధి కల్పించింది కేసీఆరేనని వెల్లడి
సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) పోటీ చేస్తుందని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి ఎన్నికల్లో ఆత్మసాక్షిగా ఓటు వేసి టీబీజీకేఎస్‌‌ను గెలిపించాలని ఆమె కోరారు. సింగరేణిని కేసీఆర్ కాపాడారని కవిత తెలిపారు. టీబీజీకేఎస్‌ను గెలిపిస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ హయాంలో సంస్థ కోసం, కార్మికుల సంక్షేమం కోసం చేసిన పనులను చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. సింగరేణి సంస్థ ఎదుగుదలకు, సంస్థను లాభాల బాట పట్టించేందుకు, కార్మికుల సంక్షేమానికి నాడు కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందన్నారు.

బీఆర్ఎస్ హయాంలో దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి కల్పించారని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలన్న ఉదార నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి లాభాల్లో కార్మికుల వాటా కేవలం 18 శాతంగా ఉండేదని... దానిని కేసీఆర్ 32 శాతానికి పెంచారని చెప్పారు.


More Telugu News