6 గ్యారెంటీలు సాధ్యం కావని చెప్పేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్టుంది!: బీజేపీ ఎమ్మెల్యేల విమర్శలు

  • హామీలను అన్నింటిని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యేలు
  • కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్చ జరపలేదని విమర్శ
  • మెగా డీఎస్సీతో పాటు రెండు లక్షల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్
 శుక్రవారం నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... శ్వేతపత్రాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. రూ.1 లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పారని.... కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్చ జరపలేదని విమర్శించారు. ఈ అంశంపై చర్చ ఎందుకు జరపలేదు? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిందనే విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసునని వారు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో ఒక్క బస్సు ప్రయాణం మాత్రమే అమలు చేశారని, మిగిలిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సాధ్యం కాదని ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినట్లుగా కనిపిస్తోందని ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీతో పాటు రెండు లక్షల ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.


More Telugu News