ఏపీ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు జాతీయ ఎస్టీ కమిషన్‌ నోటీసులు

  • ఒప్పంద నియామకాల్లో తనకు అన్యాయం జరిగిందంటూ శ్రీకాకుళం జిల్లా వాసి ఫిర్యాదుపై స్పందన
  • జనవరి 2న పూర్తి వివరాలతో హాజరు కావాలని ప్రవీణ్ ప్రకాశ్‌కు ఆదేశాలు
  • గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ ఎస్టీ కమిషన్
శ్రీకాకుళం జిల్లాలో ఐఈఆర్‌పీ (ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌) కాంట్రాక్ట్ పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ అందిన ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు నోటీసు జారీ చేసింది. తన పేరు ఓపెన్‌ కేటగిరీలో తొలి స్థానంలో ఉన్నప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ సారవకోట మండలం గోవర్ధనపురం పంచాయతీ అర్లి గ్రామానికి చెందిన పాలకొండ నిర్మల ఫిర్యాదు చేసింది. 

ఈ ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. జనవరి 2న ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్‌ ముందు హాజరుకావాలని ప్రవీణ్ ప్రకాశ్‌ను ఆదేశించింది. నిజానికి గత నెల 17నే ప్రవీణ్ ప్రకాశ్‌కు నోటీసులు అందాయి. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆయన స్పందించకపోవడంతో జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యింది. పూర్తి వివరాలతో నేరుగా వచ్చి తమ ముందు హాజరు కావాలని ప్రవీణ్ ప్రకాశ్‌కు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 

మరోవైపు తనను కూడా పూర్తి వివరాలతో హాజరవ్వాలంటూ జాతీయ ఎస్టీ కమిషన్ కోరిందని పాలకొండ నిర్మల చెప్పారు. ఓపెన్ కేటగిరిలో తన పేరు మొదటి స్థానంలో ఉన్నా తనకు ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని, అందుకే జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినట్టు చెప్పారు.


More Telugu News