పార్టీ మారానని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు.. కేసీఆర్ ఎన్ని పార్టీలు మారాడు?: రాజగోపాల్ రెడ్డి

  • తాను ప్రజల కోసమే పార్టీ మారినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • కేసీఆర్ ది మూడు పార్టీలు మారిన చరిత్ర అంటూ వ్యాఖ్య  
  • జగదీశ్ రెడ్డికి వేల కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయి? అంటూ ప్రశ్న
తాను పార్టీ మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... బీఆర్ఎస్ త్వరలో కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. ఇక ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్నారు. తాను ప్రజల కోసమే పార్టీ మారానని, ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు. అలాంటప్పుడు తాను పార్టీ మారానంటూ ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుందని, అభివృద్ధి పేరిట వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర ఆ పార్టీదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సభ్యులు నిత్యం పార్టీ మార్పుపై విమర్శలు చేస్తున్నారని.. అసలు జగదీశ్ రెడ్డికి వేలాది కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ అహంకారం చూసిన ప్రజలు ఆ పార్టీని ఓడించి బుద్ధి చెప్పారన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని, అందుకే తమను పార్టీ మారినట్లు పదేపదే అంటున్నారని విమర్శించారు.

మరి కేసీఆర్ ఏ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు? ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఎలా వచ్చారు? టీఆర్ఎస్ ఎలా స్థాపించారు? అంటే కేసీఆర్‌ది మూడు పార్టీలు మారిన చరిత్ర అని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు మరిచిపోవద్దని హితవు పలికారు. నేను మరో పార్టీలోకి వెళ్లి, తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చానంటే మీకు మా పార్టీ అధికారంలోకి వస్తుందని అర్థం కాలేదా? నేను పార్టీ మారాక.. మీరు ప్రతిపక్షంలోకి వెళ్లిన విషయం గుర్తుంచుకోవాలి అన్నారు.


More Telugu News