ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను: సింగర్ కౌసల్య

  • సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న కౌసల్య 
  • డబ్బు విషయంలో జాగ్రత్త అవసరమని వ్యాఖ్య 
  • ఒకానొక సమయంలో ఆఫర్లు లేవని వెల్లడి 
  • బాలూగారితో పాడతానని అనుకోలేదని వివరణ

సింగర్ కౌసల్య .. అనగానే చక్రి స్వరకల్పనలో ఆమె పాడిన పాటలు గుర్తుకు వస్తాయి. ఆమె ఎన్నో స్టేజ్ షోస్ కూడా ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " ఒక గాయనిగా నేను సంపాదించాను .. కానీ ఎలా దాచుకోవాలో .. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నాకు తెలియదు. నాకు అప్పుడు అంత వయసు కూడా లేదు. అందువల్లనే ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాను" అని అన్నారు.

"జీవితం ఎప్పుడూ కూడా పాఠాలను నేర్పిస్తూనే ఉంటుంది. ఎవరైనా సరే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలనే నేను చెబుతూ ఉంటాను. ఎందుకంటే అది నాకు అనుభవ పూర్వకంగా అర్థమైంది కనుక. ఒకానొక సమయంలో నాకు ఆఫర్లు లేవు .. ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగితే నా దగ్గర సమాధానం కూడా ఉండేది కాదు. ఆ తరువాతనే నేను మ్యూజిక్ అకాడమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను సంగీతంలోనే ఉండాలనే నా కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది" అని చెప్పారు. 

"నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బాలూ గారు అంటే ఎంతో ఇష్టం. ఆయనను ఒకసారి చూస్తే చాలు అనుకునే దానిని. 'పాడుతా తీయగా' నుంచే నేను పాప్యులర్ అయ్యాను. బాలూగారితో కలిసి డ్యూయెట్స్ పాడతానని నేను కలలో కూడా అనుకోలేదు. 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' కోసం నేను హైదరాబాదులో పాడితే, బాలూగారు పాడింది చెన్నైలో రికార్డు చేశారు. అందువలన ఆయనను కలవలేకపోయాను. ఆ తరువాత నేను అని తెలిసి ఆయన చాలా సంతోషపడ్డారు" అని చెప్పుకొచ్చారు. 



More Telugu News