కుప్పకూలిన ‘ఎక్స్’ సేవలు.. యూజర్ల అయోమయం!

  • ఈ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులోకి రాని సేవలు
  • యాక్సెస్ కావడం లేదంటూ వేలాదిమంది ఫిర్యాదులు
  • ఇప్పటి వరకు స్పందించని ఎక్స్
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ఎక్స్ (గతంలో ట్విట్టర్) సేవలు ఈ ఉదయం కుప్పకూలాయి. అకౌంట్‌ను యాక్సెస్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఏం జరిగిందో తెలియక లక్షలాదిమంది యూజర్లు అయోమయానికి గురయ్యారు. ఈ ఉదయం దాదాపు 11 గంటల నుంచి సేవలు అందుబాటులోకి రాకుండా పోయాయి. వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఓపెన్ అవుతున్నా.. అసంపూర్తిగా ఉండడంతోపాటు ఎక్స్ చేసే వీలు లేకుండా పోయింది. 

కొందరు యూజర్లు అయితే తమకు పోస్టులు కూడా కనిపించలేదని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఎక్స్ యాక్సెస్ లభించకపోవడాన్ని పలు టెక్ సైట్లు కూడా నిర్ధారించాయి. ఈ ఉదయం తమకు ఎక్స్ యాక్సెస్ లభించలేదంటూ 67 వేల మందికిపైగా ఫిర్యాదు చేశారు. ఇండియన్ వెర్షన్ వెబ్‌సైట్స్‌కు ఇలాంటి ఫిర్యాదులే 4,800 వచ్చాయి. సేవలు నిలిచిపోవడంపై ఎక్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.


More Telugu News