సమోసా పెట్టలేదు.. అందుకే సీరియస్ చర్చ జరగలేదు: జేడీయూ

  • ఇండియా కూటమి భేటీపై సునీల్ కుమార్ పింటూ సెటైర్
  • కాంగ్రెస్ పార్టీ నిధుల లేమితో అల్లాడుతోందని వ్యంగ్యం
  • విరాళాలు అందాక తర్వాతి భేటీలో సమోసా పెడతారన్న పింటూ
ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ భేటీపై జేడీయూ లీడర్ సునీల్ కుమార్ పింటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ సమావేశం విజయవంతమైందని, పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించి చర్చ జరిగిందని కూటమి నేతలు ప్రకటించారు. అయితే, ఈ మీటింగ్ కు ప్రతిపక్షాల నుంచి పెద్దపెద్ద నేతలంతా వచ్చినా సీరియస్ చర్చ మాత్రం జరగలేదని, దీనికి కారణం ఈ మీటింగ్ లో సమోసా పెట్టకపోవడమేనని సెటైర్లు వేశారు.

నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ.. టీ, బిస్కెట్ మాత్రమే ఇవ్వడంతో వచ్చిన వారంతా అసంతృప్తి చెందారంటూ చమత్కరించారు. నిధులు సమకూర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇటీవలే విరాళాల సేకరణ మొదలు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కూటమి తర్వాతి మీటింగ్ నాటికి విరాళాల సొమ్ము చేతికందుతుందని, తప్పకుండా సమోసా పెడతారని ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు.

కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ‘ఇండియా కూటమి’గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఏర్పాటు విషయంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మొదటి నుంచి చురుగ్గా వ్యవహరించారు. కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా నితీశ్ ను ప్రకటించాలంటూ జేడీయూ నేతలు మొదట్నుంచీ డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై కూటమి నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు.. తొలి మూడు మీటింగ్ లలోనూ ఎలాంటి చర్చ జరగలేదు. తాజా సమావేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఖర్గే సున్నితంగా తిరస్కరించారు. అయితే, జేడీయూ నేతలు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేత సునీల్ కుమార్ పింటూ తాజాగా సెటైర్లు వేస్తున్నారు. నితీశ్ ను కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News