ఈరోజు ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 3 గంటలకు సీడబ్ల్యూసీ కీలక సమావేశం

  • ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం
  • హాజరుకానున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు
  • 2024 పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో జరగనున్న కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ భేటీకి పార్టీ హైకమాండ్ తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరుకానున్నారు. 

ఈ సమావేశంలో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు, ఎంపీ సీట్ల కేటాయింపు తదితర అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 

తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తో పాటు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్నారు. వాస్తవానికి ఈరోజు జిల్లా కలెక్టర్లతో రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్నారు. అయితే, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది.


More Telugu News