ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా

  • రెండోసారి పంపిన నోటీసులనూ పట్టించుకోని ఢిల్లీ సీఎం
  • పంజాబ్ లోని ఆనంద్ గఢ్ గ్రామానికి ఆప్ చీఫ్
  • నోటీసులు రాజకీయ ప్రేరేపితం, అక్రమమన్న కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా కొట్టారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులను ఆయన లెక్కచేయలేదు. ఈ నోటీసులు రాజకీయ ప్రేరేపితమని, అక్రమమని ఈడీకి ఆయన జవాబిచ్చారు. ఈ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను నీతినిజాయతీలతో జీవిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. 

ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపింది. నవంబర్ 2న విచారణకు రమ్మని పిలవగా.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని, ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ నోటీసులు కేంద్రం ఇప్పించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అప్పుడు విచారణకు వెళ్లలేదు. దీంతో నోటీసులు వాపస్ తీసుకున్న ఈడీ.. తాజాగా గురువారం (ఈ నెల 21న) విచారణకు హాజరు కావాలని మరోమారు నోటీసులు పంపింది. అయితే, ఈసారి కూడా ఆయన విచారణకు వెళ్లలేదు.

విపాసన కోర్సుకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్ పంజాబ్ లోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లారు. మరో పది రోజుల పాటు రాజకీయాలకు కేజ్రీవాల్ దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కోర్సుకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్ మంగళవారమే బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అయితే, ఇండియా అలయెన్స్ మీటింగ్ ఉండడంతో కేజ్రీవాల్ తన ప్రోగ్రాంను గురువారానికి వాయిదా వేసుకున్నారు.


More Telugu News