హిందూస్థాన్ అంటే హిందీ కాదు.. నితీశ్‌కుమార్ ‘హిందీ’ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సద్గురు జగ్గీవాసుదేవ్

  • హిందూస్థాన్ అంటే హిందీ మాట్లాడే దేశం కాదన్న సద్గురు
  • హిమాలయాలు, హిందూ సాగరకు మధ్యనున్న ప్రాంతమని వివరణ
  • ఏదిపడితే అది మాట్లాడవద్దని సూచన
  • భాషాపరమైన వైవిధ్యాన్ని గౌరవించాలని హితవు
హిందూస్థాన్ అంటే హిందీ మాట్లాడే దేశమని, జాతీయ భాష అయిన హిందీ అందరికీ తెలిసి ఉండాలంటూ ‘ఇండియా’ కూటమి సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ తీవ్రంగా స్పందించారు. హిందూస్థాన్ అంటే హిమాలయాలు, హిందూ సాగర లేదంటే హిందువులు నివసించే ప్రాంతం తప్ప హిందీభాషకు నిలయం కాదని సామాజికమాధ్యమం ‘ఎక్స్’ ద్వారా తెలిపారు.

దేశంలోని అన్ని భాషలకు సమాన హోదా ఇచ్చే ఉద్దేశంతో, ఆ భాషను మాట్లాడేవారి సంఖ్యను బట్టి కాకుండా భాషాపరంగా రాష్ట్రాలను విడగొట్టారని సద్గురు వివరించారు. కాబట్టి భాషాపరమైన వైవిధ్యాన్ని గౌరవించాలని నితీశ్‌కు సూచించారు. సొంతభాష, సాహిత్యం, సంస్కృతితో ముడిపడిన అనేక రాష్ట్రాలు దేశంలో చాలా ఉన్నాయని, కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని గౌరవపూర్వకంగా వేడుకుంటున్నట్టు కోరారు.

మంగళవారం ఢిల్లీలో జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో నితీశ్‌కుమార్ హిందీలో ప్రసంగిస్తుండగా తనకు అర్థం కాకపోవడంతో ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ కే ఝా వైపు చూస్తూ.. నితీశ్ స్పీచ్‌ను ట్రాన్స్‌లేట్ చేయగలరా? అని డీఎంకే నేత టీఆర్ బాలు అడిగారు. దీంతో ఆయన నితీశ్ అనుమతిని కోరారు. దీనికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘మనం మన దేశాన్ని హిందూస్థాన్ అని పిలుస్తాం. హిందీ మన జాతీయ భాష. మనకు ఆ భాష తెలిసి ఉండాలి’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, తన ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్‌ను కోరారు. ఇది కాస్తా వైరల్ అయింది. 



More Telugu News