త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం: చంద్రబాబు

  • యువగళం నవశకం సభలో చంద్రబాబు ప్రసంగం
  • వచ్చేది కురుక్షేత్ర యుద్ధమన్న చంద్రబాబు
  • అందులో వైసీపీ ఓడిపోవడం ఖాయమని వెల్లడి
  • జనసేనతో పొత్తును ముందుకు తీసుకెళతామని వ్యాఖ్యలు
టీడీపీ యువగళం నవశకం సభలో చంద్రబాబునాయుడు ప్రసంగించారు. వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని, అందులో వైసీపీ ఓటమిపాలవడం ఖాయమని అన్నారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహిస్తామని... అమరావతి లేదా తిరుపతి సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ-జనసేన పొత్తును ముందుకు తీసుకెళతామని, భవిష్యత్ కార్యక్రమాలపై అధ్యయనం చేస్తామని చెప్పారు. 

"మీరొక అడుగు ముందుకు వేయండి... మేం వంద అడుగులు  ముందుకు వేస్తాం... మీరొక త్యాగం చేయండి... మేం వంద త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం" అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అలా కాకుండా... మీరు చేసుకోండి, మాకేంటి సంబంధం అనుకుంటే రాష్ట్రం నష్టపోతుందని, భావితరాలు నష్టపోతాయని స్పష్టం చేశారు. 

"ఏపీ వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి, జగన్ చేసిన పాపాలు రాష్ట్రాన్ని శాపంలా చుట్టుకున్నాయి... వైసీపీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రానికి శాపంలా మారుతుంది. జగన్ రాజకీయాలకు ఏ మాత్రం పనికిరాని వ్యక్తి. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. టీడీపీ-జనసేన సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు. ఓట్లు ఉన్నాయో లేదో ప్రజలు పరిశీలించుకోవాలి" అని చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News