అప్పుడు నాకు మొదట కాల్ చేసింది పవనన్న: నారా లోకేశ్

  • యువగళం నవశకం సభలో లోకేశ్ ప్రసంగం
  • పవనన్న అంటూ జనసేనానిపై అభిమానం ప్రదర్శించిన లోకేశ్
  • చంద్రబాబు అరెస్టయిన సమయంలో పవన్ అండగా నిలిచారని వెల్లడి
  • తన తల్లి భువనమ్మ న్యాయం జరిగేంతవరకు ఇంటికి రావొద్దని చెప్పిందన్న లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం నవశకం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ వేనోళ్ల కీర్తించారు. పవనన్న అంటూ పదే పదే సంబోధిస్తూ తన తన అభిమానాన్ని చాటుకున్నారు. సెప్టెంబరులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిన సమయంలో మొదట నాకు కాల్ చేసి అండగా నిలిచింది పవనన్న అని లోకేశ్ వెల్లడించారు. పవన్ తనలో ఎంతో భరోసా కలిగించారని కొనియాడారు. 

ధైర్యంగా ఉండు లోకేశ్ అని ఆయన ఆ రోజే చెప్పారు... మేమంతా నీ వెంట ఉన్నాం... బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు... నువ్వు నిబ్బరంగా ఉండు అని పవన్ కొండంత అండలా నిలిచారని వివరించారు. పవన్ బయటికొస్తే సైకో సైన్యానికి వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. 

అప్పటివరకు ఇంటి గడప తొక్కవద్దని మా అమ్మ చెప్పింది

చంద్రబాబును రాజమండ్రి జైల్లో చూశాక చాలా బాధ కలిగిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నిర్మించిన బ్యారక్ లోనే ఆయనను ఉంచారు. చంద్రబాబుతో ములాఖత్ అయిన రూం ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూం అని వెల్లడించారు. 

"దేవుడు మాకో పరీక్ష పెట్టాడని అనుకున్నాం... ఆ సమయంలో మా అందరి అమ్మ భువనమ్మ అండగా నిలబడింది. గుండెల్లో ఎంత బాధ ఉన్నా నువ్వు ప్రజల కోసం పోరాడు... న్యాయం జరిగాకే ఇంటి గడప తొక్కు... అప్పటివరకు ఇంటికి రావొద్దు అని మా అమ్మ భువనమ్మ నన్ను ముందుకు పంపింది" అని వివరించారు. 

వడ్డీతో సహా చెల్లిస్తాం

టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. వడ్డీతో సహా చెల్లిస్తాం. చట్టాన్ని ఉల్లఘించిన వారి పేర్లు అన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయి వారికి శిక్ష తప్పదు. నా పాదయాత్రలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లు, ఇతర కమిటీల సభ్యులను అభినందిస్తున్నాను. సైకో పోవాలి... సైకిల్ రావాలి ...  సైకో పోవాలి... సైకిల్ రావాలి ... మరి మా పవనన్న పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెప్పాలి కదా... హలో ఏపీ ... బై బై వైసీపీ. హలో ఏపీ ... బై బై వైసీపీ" అంటూ లోకేశ్ తన ప్రసంగాన్ని ముగించారు.


More Telugu News