కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రగతి నివేదిక.. అసెంబ్లీలో రిలీజ్ చేసిన బీఆర్ఎస్

  • తెలంగాణలో సృష్టించిన ఆస్తులను జాబితాలో పేర్కొన్న ప్రతిపక్ష పార్టీ
  • ప్రభుత్వం విడుదల చేయనున్న శ్వేత పత్రానికి కౌంటర్ డాక్యుమెంట్
  • అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటూ ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టిన బీఆర్ఎస్
తెలంగాణ ఆర్థిక పరిస్థితి, తొమ్మిదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా ప్రభుత్వాని కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఓ డాక్యుమెంట్ ను రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సాధించిన ఆర్థిక ప్రగతి, మాజీ కేసీఆర్ సృష్టించిన ఆస్తుల వివరాలను అందులో పొందుపరిచింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఈ డాక్యుమెంట్ ను విడుదల చేసింది. అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటూ ఇందులో పేర్కొంది. 2014తో పోల్చితే 2023 నాటికి తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో గణాంకాలతో సహా బీఆర్ఎస్ ఈ డాక్యుమెంట్ లో వివరించింది.

మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ అప్పులపాలైందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలోనూ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా పలుమార్లు ఇవే ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఈ నెల 20 (బుధవారం) న అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈ నెల 8న మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. దీనికోసం ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మొత్తం 20 మంది సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని ఆర్థిక రంగ నిపుణులు, ప్రస్తుత, రిటైర్డ్ ప్రొఫెసర్లు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం తయారు చేశారు.


More Telugu News