సివిల్స్ ఇంటర్వ్యూల షెడ్యూల్ విడుదల చేసిన యూపీఎస్సీ

  • ఇటీవల యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల వెల్లడి
  • మొత్తం 2,844 మంది అభ్యర్థుల ఉత్తీర్ణత
  • వారిలో 1,026 మందికి తొలి విడతలో ఇంటర్వ్యూలు
  • మిగిలిన వారికి మరో షెడ్యూల్ విడుదల చేయనున్న యూపీఎస్సీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇటీవల సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మెయిన్స్ ఉత్తీర్ణులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు యూపీఎస్సీ సిద్ధమైంది. ఆ మేరకు ఇంటర్వ్యూల షెడ్యూల్ విడుదల చేసింది. 

2024 జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అయితే, యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో 2,844 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు కాగా... వారిలో 1,026 మంది అభ్యర్థులకే ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకటించారు. మిగిలిన అభ్యర్థులకు మరో షెడ్యూల్ ప్రకటించనున్నారు. 

తొలి విడత ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు త్వరలో ఆన్ లైన్ లో కాల్ లెటర్లు పంపిస్తామని యూపీఎస్సీ వెల్లడించింది. కాగా, ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ చార్జీలు రీయింబర్స్ చేస్తామని యూపీఎస్సీ పేర్కొంది. అయితే, ఇది రైళ్లలో సెకండ్/స్లీపర్ క్లాస్ లో ప్రయాణించిన వారికే వర్తిస్తుంది.


More Telugu News