బిగ్ బాస్ టైటిల్ ను పల్లవి ప్రశాంత్ గెలవడంపై శివాజీ స్పందన
- బిగ్ బాస్ గొప్ప అనుభూతిని ఇచ్చిందన్న శివాజీ
- ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే విజేతను నిర్ణయించారని వ్యాఖ్య
- పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడం సంతోషంగా ఉందన్న శివాజీ
బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ - సీజన్ 7 ముగిసింది. ఈ సీజన్ లో శివాజీ గెలుస్తాడని చాలా మంది భావించినప్పటికీ... చివరి వారాల్లో పుంజుకుని పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. మరోవైపు శివాజీని స్టార్ మా తొక్కేసిందని... ఆయనను కాదని పల్లవి ప్రశాంత్ కు టైటిల్ కట్టబెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శివాజీ ఓ వీడియోను విడుదల చేశారు. వీడియోలో కీలక వ్యాఖ్యలు చేశారు.
'మా నటులకు ప్రేక్షకులే దేవుళ్లు. కానీ జీవితంలో నటించేవారిని ఎవరూ ఆదరించరు. బిగ్ బాస్ నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. సినిమాల్లో నాకు తొలి అవకాశం ఇచ్చిన నాగార్జున గారు బిగ్ బాస్ హోస్ట్ గా మెప్పించారు. ఈ షో సక్సెస్ కావడం వెనుక ఆయన పాత్ర ఎంతో ఉంది. నేను ఎవరి వద్ద తగ్గను. కానీ నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఆచి తూచి మాట్లాడేవాడిని. నన్ను స్టార్ మా పక్కన పెట్టింది, పల్లవి ప్రశాంత్ కు టైటిల్ ఇచ్చింది అంటున్నారు. ఇది నిజం కాదు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే విజేతను నిర్ణయిస్తారు. ప్రశాంత్ నా బిడ్డ. వాడు టైటిల్ గెలవడం నాకు సంతోషంగా ఉంది' అని శివాజీ చెప్పారు.