ఆశ్చర్యచకితులను చేసే విజువల్స్ తో 'హను మాన్' .. ట్రైలర్ రిలీజ్!
- ప్రశాంత్ వర్మ నుంచి 'హను మాన్'
- నిర్మాతగా వ్యవహరించిన నిరంజన్ రెడ్డి
- విస్మయులను చేసే వీఎఫ్ ఎక్స్
- కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
- 11 భాషల్లో జనవరి 12న విడుదల
తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హను మాన్' సినిమాను రూపొందించాడు. అమృత అయ్యర్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. హీరోకి అక్కయ్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించగా, ప్రత్యేకమైన పాత్రను సముద్రఖని పోషించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు.
హీరో ఫ్యామిలీ అంజనాద్రి ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరి వెంట హనుమంతుడు ఉంటాడని హీరో భావిస్తూ ఉంటాడు. మానవాతీతమైన శక్తులను సంపాదించుకోవడం కోసం విలన్ అక్కడ అడుగుపెడతాడు. అతణ్ణి హీరో ఎలా ఎదిరించాడనేదే కథ అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
కొండలు .. జలపాతాలు .. సెలయేళ్లు .. పక్షులు .. మంచుకొండలో హనుమ ధ్యానంలో ఉండటం .. వంటి విజువల్స్ గొప్పగా ఉన్నాయి. సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. జనవరి 12వ తేదీన ఈ సినిమాను 11 భాషల్లో విడుదల చేయనున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ నచ్చే కంటెంట్ కావడంతో, సంక్రాంతికి ఈ సినిమా సందడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.