ఐపీఎల్ వేలం: ఆసీస్ స్టార్ ఆటగాడిని దక్కించుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

  • దుబాయ్ లో ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలం
  • వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లు
  • ప్రారంభమైన వేలం ప్రక్రియ
  • రూ.6.8 కోట్లతో ట్రావిస్ హెడ్ ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్
  • వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీతో రాణించిన హెడ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ దుబాయ్ లో ఈ మధ్యాహ్నం ప్రారంభమైంది. ఎప్పుడూ ఓ మోస్తరు ఆటగాళ్లపై ఆసక్తి చూపించే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి ఏకంగా ఓ స్టార్ ఆటగాడిని కొనేసింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో సెంచరీతో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ నేటి వేలంలో దక్కించుకుంది. 

ట్రావిస్ హెడ్ కనీస ధర రూ.2 కోట్లు. ఈ లెఫ్ట్ హ్యాండర్ కోసం పోటాపోటీగా వేలం పాట సాగినా, చివరికి సన్ రైజర్స్ రూ.6.8 కోట్లకు అతడిని కైవసం చేసుకుంది. పవర్ ప్లేలో మాత్రమే కాదు, మ్యాచ్ లో ఏ దశలోనైనా ధాటిగా ఆడగలిగే సత్తా ఉన్న ట్రావిస్ హెడ్ రాకతో సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ బలోపేతం అవుతుందనడంలో సందేహం లేదు. 

అదే సమయంలో, సన్ రైజర్స్ విడుదల చేసిన ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ కు మినీ వేలంలో మంచి ధరే లభించింది. అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ లో అతడిని సన్ రైజర్స్ రికార్డు స్థాయిలో రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసినా, అతడు స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చకపోవడంతో, ఈ సీజన్ కు అతడిని వదిలించుకుంది. 

సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఈ వేలంలో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగను కూడా కొనేసింది. అతడిని ఒకరకంగా చవకగా చేజిక్కించుకుంది అని చెప్పాలి. హసరంగను సన్ రైజర్స్ రూ.1.50 కోట్లకు దక్కించుకుంది. 

ఇక, ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ ను వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈసారి వేలంలో జాక్ పాట్ అంటే వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోవ్ మాన్ పావెల్ దే అని చెప్పాలి. అతడి కనీస ధర రూ.1 కోటి కాగా... అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.7.4 కోట్లకు చేజిక్కించుకుంది.


More Telugu News