ఎంత పేరొచ్చినా నాన్నేమీ మారలేదు: మాధవపెద్ది సత్యం తనయుడు మూర్తి

  • అలనాటి గాయకుడు మాధవపెద్ది సత్యం 
  • ఆయన గురించి ప్రస్తావించిన తనయుడు 
  • తన తండ్రికి ఆడంబరాలు నచ్చవని వెల్లడి 
  • సింపుల్ గా సైకిల్ పై తిరిగేవారని వివరణ  

'వివాహ భోజనంబు .. వింతైన వంటకంబు' అనే పాట ఈ రోజుకీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాట పాడినవారు మాధవపెద్ది సత్యం. అప్పట్లో ఎస్వీ  రంగారావుకి ఆయనే పాటలు .. పద్యాలు పాడేవారు. తాజా ఇంటర్వ్యూలో మాధవపెద్ది సత్యం గురించి, ఆయన తనయుడు వెంకటనారాయణమూర్తి మాట్లాడారు. 

"మా నాన్నగారి ఊరు గుంటూరు జిల్లాలోని 'బ్రాహ్మణ కోడూరు'. వాళ్లు 11 మంది సంతానం. నాకు ఊహ తెలిసిన తరువాత ఏడుగురు మాత్రం ఉండేవారు. మా పెదనాన్నగారి పిల్లలే మాధవపెద్ది రమేశ్ - సురేశ్. మా నాన్నగారికి మా అక్కయ్య .. నేను ఇద్దరమే. అప్పట్లో నాన్నగారు సినిమా పాటలతో .. నాటకాలతో బిజీగా ఉండేవారు. మా అమ్మగారి పేరు ప్రభావతి. వారి వివాహం 1951లో జరిగింది. 

మా నాన్నగారి తరపు బంధువులే ఎస్. జానకి గారు. ఆమె కూడా ఆ పెళ్లికి వచ్చారు. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్లు. నాన్నగారికి ఎంత పేరు వచ్చినా చాలా సింపుల్ గా ఉండేవారు. ఆడంబరాలు ఆయనకి నచ్చేవి కాదు. బహుశా లుంగీ - జుబ్బాపై రికార్డింగ్ థియేటర్ కి వెళ్లి పాడింది మా నాన్నగారు ఒక్కరే కావొచ్చు. ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిల్ పైనే వెళ్లేవారు" అని చెప్పారు.


More Telugu News