నేడు ఐపీఎల్ మినీ వేలం.. రిషభ్‌పంత్ ఫిట్‌నెస్ సంగతేంటి?
- గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్
- అప్పటినుంచి జట్టుకు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్
- కోలుకుని ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్న ఢిల్లీ ఆటగాడు
- వచ్చే ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి
గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి కారులో ఇంటికి వెళ్తూ ఘోర ప్రమాదానికి గురై బతికి బయటపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌పంత్ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకుని ప్రాక్టీస్ కూడా చేస్తున్న పంత్ నేటి ఐపీఎల్ వేలానికి అందుబాటులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడి ఫిట్‌నెస్‌పై తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది. వేలం కోసం ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న పంత్ ఐపీఎల్ ప్రారంభం నాటికి పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సంతరించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. పంత్ ఐపీఎల్ 2024లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం ఉంది. అంటే, వికెట్ కీపింగ్ బాధ్యతలు పూర్తిగా నిర్వహించేందుకు సిద్ధంగా లేడని దీనిని బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం తాను చాలా మెరుగ్గానే ఉన్నానని, 100 శాతం కోలుకుంటున్నానని పంత్ చెబుతున్న వీడియోను ఢిల్లీ కేపిటల్స్ విడుదల చేసింది.
పంత్ ఫిట్‌నెస్‌పై ఢిల్లీ కేపిటల్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉంది. అంతమాత్రాన రాబోయే టోర్నమెంట్ నుంచి అతడిని తప్పించుకున్నట్టు కూడా ప్రకటించలేదు. మరోవైపు, ఢిల్లీ కేపిటల్స్ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో పంత్ ఆడతాడని స్పష్టం చేశాడు.