బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగి కిడ్నాప్.. ఏటీఎం పిన్ కోసం బెదిరింపు.. ఈలోపు ప్రమాదం
- బైక్‌లపై వచ్చి అధికారి ప్రయాణిస్తున్న కారును అడ్డగించిన దుండగులు
- కారు డ్రైవర్‌ను కొట్టి బయటకు ఈడ్చి పడేసి అధికారి కిడ్నాప్
- రూ. 5 కోట్లు ముట్టజెబితేనే విడిచిపెడతామన్న కిడ్నాపర్లు
- అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన కారు
- ఇదే అదునుగా తప్పించుకున్న అధికారి
- కిడ్నాపర్ల కోసం పోలీసుల గాలింపు
బీహార్‌లో ప్రభుత్వ అధికారిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆయన ఏటీఎం కార్డు లాక్కున్నారు. ఆపై దాని పిన్ చెప్పాలంటూ బెదిరించారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి మురికి కాల్వలోకి దూసుకెళ్లడంతో అదే అదునుగా ఆయన తప్పించుకున్నారు. వైశాలి జిల్లాలో జరిగిందీ ఘటన.
విద్యాశాఖలో ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఉదయ్‌కుమార్ ఉజ్వల్ శనివారం రాత్రి హజీపూర్ నుంచి పాట్నాలోని తన ఇంటికి బయలుదేరారు. హజీపూర్-చాప్రా జాతీయ రహదారిపై సోనేపూర్ సమీపంలో బైక్‌పై వచ్చిన ఆరుగురు దుండగులు ఆయన ప్రయాణిస్తున్న కారుని అడ్డగించారు.
కారు ఆగగానే డ్రైవర్‌ను చితకబాది బయటపడేసి అధికారిని కిడ్నాప్ చేసి అదే కారుతో బయలుదేరారు. రూ. 5 కోట్లు ఇస్తే వదిలేస్తామని బెదిరించారు. ఆ తర్వాత అతడి నుంచి ఏటీఎం కార్డులు తీసుకుని పిన్ నంబర్ చెప్పాలని బెదిరించారు. ఈ క్రమంలో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఉదయ్‌కుమార్ క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని రక్షించి, కారును స్వాధీనం చేసుకున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, కిడ్నాపర్ల చేతిలో దెబ్బలు తిన్న కారు డ్రైవర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు ఉదయ్‌కుమార్ నుంచి కొంత డబ్బు ఏటీఎం కార్డులు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు.