‘సైలెంట్ టై-బ్రేకర్ బిడ్’ అంటే ఏమిటి?.. ఒక ఆటగాడి కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఒకే రేటు కోట్ చేస్తే జరిగేది ఇదే..!

  • డబ్బు కొరత కారణంగా ఒక ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు ఉమ్మడి బిడ్ వేస్తే ‘సైలెంట్ టై-బ్రేకర్ బిడ్’ రూల్ ద్వారా ఆటగాడి కేటాయింపు
  • ఒక ఫారమ్‌పై తమ బిడ్‌ను రాతపూర్వకంగా తెలియజేయనున్న జట్లు
  • నేడు దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2024 మినీ వేలం
దుబాయ్ వేదికగా నేడు (మంగళవారం) జరగనున్న ఐపీఎల్ మినీ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ ఆటగాడిని, ఏ ఫ్రాంచైజీ ఎంత రేటుకు దక్కించుకోనుందనేది ఉత్కంఠగా మారింది. అయితే వేర్వేరు ఫ్రాంచైజీలు డబ్బు కొరత కారణంగా ఒక ఆటగాడి కోసం సమానమైన రేటు కోట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుంది?.. ఈ పరిస్థితికి పరిష్కారం చూపేదే ‘సైలెంట్ టై-బ్రేకర్ బిడ్’ రూల్. ఐపీఎల్ వేలంలో అత్యంత కీలకమైన ఈ రూల్‌కి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

ఐపీఎల్ ఫ్రాంచైజీల వద్ద నిధులు పరిమితంగా మిగిలివుంటాయి. పరిమితికి మించి ఖర్చు చేసే వీలుండదు కాబట్టి ఉన్న దాంట్లోనే వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు ఒక ఆటగాడి కోసం వేసే బిడ్ టైగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో ఫ్రాంచైజీలు చేసేదేమీ ఉండదు. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో ఆటగాడిని ఎవరు పొందాలనేది టై-బ్రేకర్ బిడ్ రూల్‌ ద్వారా తేల్చుతారు.

సదరు ఆటగాడి కోసం సమాన మొత్తంలో ఉమ్మడి బిడ్ వేసిన ఫ్రాంచైజీలు ఒక ఫారమ్‌పై రాతపూర్వకంగా తమ బిడ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అందులో ఎక్కువ మొత్తం చెల్లిస్తానని ఏ జట్టు రాసిస్తే ఆ జట్టుకే ఆటగాడిని కేటాయిస్తారు. వాగ్దానం చేసిన డబ్బు ఫ్రాంచైజీలు బిసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. టై-బ్రేకర్ బిడ్‌లు కూడా సమానంగా ఉంటే విజేతను నిర్ణయించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మినీ వేలంలో బిడ్‌తో పాటు ఈ అదనపు మొత్తం కూడా ఆటగాడికి దక్కుతుంది. ఈ అదనపు చెల్లింపు ఫ్రాంచైజీలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. కాగా టై బ్రేకర్ బిడ్‌ ద్వారా 2010 ఐపీఎల్ వేలంలో కీరన్ పొలార్డ్‌ను ముంబై ఇండియన్స్, షేన్ బాండ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ దక్కించుకున్నాయి. ఇక 2012 వేలంలో రవీంద్ర జడేజాను ఈ పద్ధతిలోనే చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.

కాగా ఐపీఎల్ మినీ వేలానికి రంగం సిద్ధమైంది. మొత్తం 333 మంది క్రికెటర్లు ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉన్నారు. వీరిలో 214 మంది భారతీయ ఆటగాళ్లు కాగా 119 మంది విదేశీ ఆటగాళ్ళు. జాబితాలో 116 మంది క్యాప్డ్ ప్లేయర్‌లు, 215 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. కాగా గుజరాత్ టైటాన్స్ ఎక్కువ మొత్తం డబ్బుతో ఈ ఏడాది వేలంలో పాల్గొనబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ వద్ద తక్కువ డబ్బు ఉంది. గుజరాత్ టైటాన్స్ (రూ. 38.15 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 34 కోట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 32.7 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 31.4 కోట్లు), పంజాబ్ కింగ్స్(రూ. 29.1 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 28.95 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 23.25 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ. 17.75 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (రూ. 14.5 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (రూ. 13.15 కోట్లు) డబ్బుతో వేలంలో పాల్గొనబోతున్నాయి.


More Telugu News