ఈ నెల 28 నుంచి గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తాం: షబ్బీర్ అలీ

  • పీఏసీ సమావేశం వివరాలు వెల్లడించిన షబ్బీర్ అలీ
  • రేషన్ కార్డు, ఆసరా పెన్షన్, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇళ్లు, గ్యాస్ అంశాలపై చర్చించినట్లు వెల్లడి
  • సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని తీర్మానం చేశామన్న షబ్బీర్ అలీ
పీఏసీ సమావేశంలో రేషన్ కార్డు, ఆసరా పెన్షన్, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500కు గ్యాస్ అంశాలపై చర్చించినట్లు పీఏసీ సమన్వయకర్త షబ్బీర్ అలీ తెలిపారు. సోమవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలపై షబ్బీర్ అలీ మీడియాకు వివరించారు. పీఏసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, మూడు అంశాలపై తీర్మానం చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపామన్నారు. ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ అగ్రనాయకులందరికీ ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు

సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు. అలాగే ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై మంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారని, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నామన్నారు. మిషన్ భగీరథ అవకతవకలపైనా చర్చించినట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించి గ్యారెంటీ పథకాల అర్హులను ఎంపిక చేస్తామన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జులను నియమించినట్లు వెల్లడించారు.


More Telugu News