నాన్నకి సిఫార్సులు ఇష్టం ఉండదు: 'సిరివెన్నెల' తనయుడు రాజా

  • నటుడిగా ఎదుగుతున్న రాజా 
  • తండ్రి సీతారామశాస్త్రి ప్రస్తావన 
  • తన అవకాశాలు తానే వెతుక్కున్నానని వెల్లడి 
  • అలా చాలా అవకాశాలు పోయాయని వివరణ   

'సిరివెన్నెల' సీతారామశాస్త్రి తనయుడు రాజా, నటుడిగా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలను పంచుకున్నాడు. " మా నాన్నగారితో పాటలు రాయించుకోవడానికి దర్శక నిర్మాతలు మా ఇంటికి వస్తుండేవారు. వాళ్లందరికీ కూడా నేను తెలుసు. వాళ్లు వచ్చింది నాన్నగారి కోసం కావడం వలన, నేను వాళ్లతో పెద్దగా మాట్లాడేవాడిని కాదు.

"నాన్నగారికి చాలామంది దర్శక నిర్మాతలు తెలుసు. కానీ 'మా వాడిని తీసుకోండి .. ఒక ఛాన్స్ ఇవ్వండి' అని ఆయన ఎవరినీ అడిగేవారు కాదు. అసలు ఆయనకి ఇవ్వడమే తప్ప అడగడం రాదు. నేను కూడా ఎప్పుడూ నా గురించి అడగమని ఆయనను అడగలేదు. నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ వెళ్లాను" అని అన్నాడు. 

"నా అవకాశాలను నేను వెతుక్కుంటూ వెళ్లాను. సినిమాల ఆఫీసుల చుట్టూ తిరిగాను. అయితే ఎవరినీ ఎక్కువ సార్లు కలిసి ఇబ్బంది పెట్టలేదు. చిన్న వేషం .. సీతారామశాస్త్రిగారి అబ్బాయికి ఇస్తే బాగుండేదేమోనని మానుకున్నవారే ఎక్కువ. అందువలన ఎక్కువ వేషాలు పోయాయనే నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. 


More Telugu News