10 ఏళ్ల దళిత బాలికకు అవమానం.. బాధితురాలి కాలును కాలితో తొక్కిన నర్సు!

  • డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘటన 
  • మనవరాలు కాలునొప్పితో బాధపడుతుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లిన తాత
  • బాలిక కాలును తన కాలితో తొక్కి పరీక్షించిన నర్సు
  • బాలిక తాత ఆగ్రహించడంతో క్షమాపణలు చెప్పిన నర్సు
డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ దళిత బాలికను నర్సు కాలితో తొక్కి పరీక్షిస్తూ అవమానించింది. జిల్లాలోని కాట్రేనికోనకు చెందిన నేలపాటి భాస్కరరావు తన పదేళ్ల మనవరాలు కాలినొప్పితో బాధపడుతుండటంతో ఆదివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే, అక్కడున్న నర్సు మణికుమారి మాత్రం చిన్నారి కాలును తన కాలితో తొక్కి పరీక్షించింది. చికిత్స ఏమీ చేయకుండానే అమలాపురం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించింది. 

దీంతో, భాస్కరరావు నర్సుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగిని అవమానించినందుకు పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో, నర్సు క్షమాపణ చెప్పింది. కాగా, సదరు నర్సు డిప్యుటేషన్‌పై తమ ఆసుపత్రిలో పనిచేస్తోందని ఆసుపత్రి వైద్యురాలు నిఖిత తెలిపారు. ఇలాంటి ఘటనలను మళ్లీ జరగకుండా చూస్తామని చెప్పారు.


More Telugu News