పార్లమెంటు భద్రత ఉల్లంఘన కేసు.. రాజస్థాన్‌లో దొరికిన కాలిపోయిన ఫోన్ భాగాలు, నిందితుల దుస్తులు

  • నిన్న ఆరో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించిన కోర్టు
  • నిందితులకు పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహను విచారించనున్న అధికారులు
  • మీడియా దృష్టిని ఆకర్షించేందుకు తొలుత నిప్పు పెట్టుకోవాలని భావించిన నిందితులు
  • ఆపై ఆ ప్లాన్‌ను పక్కనపెట్టి పొగ డబ్బాలతో చాంబర్‌లోకి
పార్లమెంటు భద్రత ఉల్లంఘన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు నిందితులు అరెస్టయ్యారు. నిందితులకు విజిటర్ పాస్‌లు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహను విచారించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భావిస్తోంది. ఈ కేసులో ఆరో నిందితుడైన మహేశ్ కుమావత్‌ను ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఘటనలో అతడి పాత్ర ఉన్నట్టు నిర్ధారించుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఇంటరాగేషన్ కోసం కోర్టు అతడిని ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. 

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన నిందితులకు సంబంధించిన కాలిపోయిన మొబైల్ ఫోన్లు, దుస్తులు, బూట్లను శనివారం పోలీసులు రాజస్థాన్‌లో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా నిందితులందరి ఫోన్లు తీసుకుని తొలుత వాటిని పగలగొట్టాడు. ఆ తర్వాత కాల్చివేశాడు. 

మీడియా దృష్టిని ఆకర్షించేందుకు నిందితులు తమనుతాము గాయపరుచుకోకుండా జాగ్రత్త పడుతూ తమ శరీరాలపై అగ్ని నిరోధక జెల్‌ను పూసుకుని నిప్పంటించుకోవడం, లేదంటే కరపత్రాలను విసరడం వంటివి చేయాలనుకున్నారు. అయితే, ఆ తర్వాత వారు ఆ ఆలోచనను విరమించుకుని పొగ డబ్బాలతో లోక్‌సభ చాంబర్‌లోకి దూకాలని నిర్ణయానికి వచ్చి అదే అమలు చేసినట్టు విచారణాధికారులు తెలిపారు.


More Telugu News