సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్

  • గుర్తింపు సంఘం ఎలక్షన్స్ పై కార్మిక సంఘాల గొడవ
  • ఈ నెల 27న జరగాల్సిన ఎన్నికలు
  • వాయిదా వేయాలంటూ ఇంధన శాఖ పిటిషన్
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్దం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది.

ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించడం వెనక ఎన్ఐటీయూసీ నేతల హస్తం ఉందని ఏఐటీయూసీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, చేయాల్సిందంతా ఏఐటీయూసీ నేతలు చేసి తమపై నిందలు వేస్తున్నారంటూ ఎన్ఐటీయూసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుందని రెండు సంఘాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజా పిటిషన్ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ప్రచారంలో దూసుకెళుతున్న రెండు సంఘాల నేతలు.. ఇంధన శాఖ పిటిషన్ వెనక మీరంటే మీరున్నారంటూ పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు.


More Telugu News