సీఎం రేవంత్‌రెడ్డి ఆఫర్‌ను తోసిపుచ్చిన మాజీ డీఎస్పీ నళిని

  • నళినికి ఉద్యోగం చేయాలని ఉంటే మళ్లీ తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
  • రాష్ట్రం కోసం రాజీనామా చేేసిన నాయకులకు పదవులు ఇచ్చినప్పుడు ఆమెకు ఎందుకు అన్యాయం జరగాలని ప్రశ్న
  • తాను సంతోషంగా ఉన్నానన్న నళిని
  • తన ప్రశాంతతకు భంగం కలిగించవద్దని వేడుకోలు
తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనను మాజీ డీఎస్పీ నళిని సున్నితంగా తిరస్కరించారు. తన ప్రశాంతతను భంగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి మళ్లీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. 

ఆమెకు తిరిగి పోలీస్‌శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు అవరోధాలు ఉంటే వేరే శాఖలో అదే హోదా కలిగిన ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. నళినికి న్యాయం జరగలేదని, ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు ఇచ్చినప్పుడు.. నళినికి ఎందుకు అన్యాయం జరగాలని రేవంత్‌ ప్రశ్నించారు.

నళినిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలన్న ప్రభుత్వం ఆలోచనను ఓ న్యూస్‌ చానల్ ఆమె వద్ద ప్రస్తావించగా.. ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తానిప్పుడు సంతోషంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేసి రాజకీయ నాయకుల నుంచి తప్పించుకున్నానని తెలిపారు. తన ఉద్యోగం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేదని పేర్కొన్నారు. దయచేసి తన ప్రశాంతతకు భంగం కలిగించవద్దని కోరుతున్నట్టు చెప్పారు.


More Telugu News