పవన్ కల్యాణ్ కు ఎన్ని సీట్లు ముష్టి వేస్తున్నారో చెప్పాలి: మంత్రి అంబటి రాంబాబు

  • టీడీపీ, జనసేన పార్టీలను తుక్కు తుక్కుగా ఓడిస్తామన్న అంబటి
  • 60 శాతానికి పైగా ప్రజలు మళ్లీ జగన్ నే సీఎంగా కోరుకుంటున్నారని వెల్లడి
  • గతంలో టీడీపీ, జనసేన ఎందుకు విడిపోయాయో చెప్పాలని డిమాండ్ 
ఏపీ మంత్రి అంబటి రాంబాబు విపక్ష నేతలపై ధ్వజమెత్తారు. టీడీపీ, జనసేన పార్టీలను తాము తుక్కు కింద ఓడిస్తామని అన్నారు. చంద్రబాబుకు సింగిల్ గా పోటీ చేసే సత్తా లేదని ఎద్దేవా చేశారు. 

మేం ఇన్చార్జిలను మార్చడం గురించి అడుగుతున్నారు సరే... చంద్రబాబు ఎక్కడ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు? చంద్రగిరిలో ఓడిపోయిన చంద్రబాబు కుప్పం ఎందుకు పారిపోయారు? సొంత జిల్లా చిత్తూరులో కాకుండా లోకేశ్ ను మంగళగిరి ఎందుకు తీసుకువచ్చారు? బాలకృష్ణ స్వస్థలం వదిలి హిందూపురంలో ఎందుకు పోటీ చేశారు? పురందేశ్వరి ఎందుకు సీట్లు మార్చుతున్నారు? అంటూ అంబటి ప్రశ్నల వర్షం కురిపించారు. 

గతంలో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన ఎందుకు విడిపోయాయో చెప్పాలని, ఇప్పుడు చంద్రబాబు మళ్లీ పవన్ కల్యాణ్ ను వెంటేసుకుని రావడానికి కారణమేంటో చెప్పాలని నిలదీశారు. ఇంతకీ పవన్ కల్యాణ్ కు ఎన్ని స్థానాలు ముష్టి వేస్తున్నారు? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని అంబటి వివరించారు.


More Telugu News