మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... మెట్రో రైళ్లపై ప్రభావం... సులభంగా దొరుకుతున్న సీట్లు!

  • ఆటోలపై తీవ్ర ప్రభావం చూపిన ఉచిత బస్సు ప్రయాణం
  • మెట్రో రైళ్లలోనూ దాదాపు అదే పరిస్థితి
  • పీక్ అవర్స్‌లోను మెట్రోలో తగ్గిన మహిళల ప్రయాణం
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, విద్యార్థినులకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తోన్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ ప్రభావం ఆటో ప్రయాణాలపైనే కాదు... మెట్రో రైలు పైనా ప్రభావం చూపింది. ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల మహిళలు ఆర్టీసీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్సులు మహిళలతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గింది. దాంతో మెట్రో రైళ్లలో సులభంగా సీట్లు దొరుకుతున్నాయి. కొందరు మహిళలు మాత్రమే మెట్రో రైలును వినియోగిస్తున్నారు.

కార్యాలయాలు సమీపంలో ఉన్నప్పుడు ఇదివరకు మెట్రో ఎక్కిన వారు కూడా ఇప్పుడు బస్సును ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఉచిత ప్రయాణ ప్రభావం మెట్రోపై కూడా పడింది. అదే సమయంలో బస్సులలో మహిళా ఉద్యోగుల జాతర కనిపిస్తోంది. కొంతమంది మహిళలు ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వరకు.. మెట్రో స్టేషన్ నుంచి ఆఫీస్ వరకు కూడా ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. 

ప్రధాన మార్గాల్లో తిరిగే బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలైనప్పటి నుంచి సీట్లు దొరకడమే గగనంగా మారింది. నాన్ పీక్ అవర్స్‌లో మెట్రో రైళ్లలో మహిళల రద్దీ బాగా తగ్గింది. మెట్రోలో గతంలో కంటే రద్దీ తగ్గిందని, సీట్లు దొరుకుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.


More Telugu News