ఐటీ రెయిడ్లలో రూ.350 కోట్లు సీజ్.. తొలిసారిగా స్పందించిన ఝార్ఖండ్ ఎంపీ

  • రూ.350 కోట్ల నగదు రికవరీపై నోరు విప్పిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ 
  • ఆ డబ్బు తనది కాదని, తన కంపెనీలదని ఎంపీ వివరణ
  • తమ కుటుంబానికి పలు వ్యాపారాలున్నాయని వెల్లడి
  • తనపై వస్తున్న ఆరోపణలు బాధిస్తున్నాయని వ్యాఖ్య
ఇటీవల ఐటీ రెయిడ్ల సందర్భంగా తన నివాస ప్రాంగణాల్లో రికార్డు స్థాయిలో పట్టుబడ్డ రూ.350 కోట్ల నగదుపై ఝార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ తొలిసారిగా స్పందించారు. ఆ డబ్బు తనది కాదని, తన కంపెనీలకు చెందినదని వివరణ ఇచ్చారు. కంపెనీల వ్యవహారాలు తన కుటుంబసభ్యులు చూస్తుంటారని పేర్కొన్నారు. ఆ డబ్బుతో కాంగ్రెస్‌కు, ఇతర రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘గత 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నాపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరం. ఆ డబ్బు మా కంపెనీలదని నేను గట్టిగా చెబుతున్నా. మేము గత 100 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నాము. నేను రాజకీయాల్లో ఉండటంతో వ్యాపారాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఆ వ్యవహారాలను నా కుటుంబసభ్యులే చూసుకుంటున్నారు. వ్యాపారం ఎలా సాగుతోందని మాత్రమే నేను అప్పుడప్పుడూ అడుగుతుండే వాణ్ణి’’ అని ఎంపీ సాహూ చెప్పుకొచ్చారు. తనకు ఆరుగురు సోదరులు ఉన్నారని, తమది పెద్ద ఉమ్మడి కుటుంబమని ఆయన చెప్పుకొచ్చారు. సోదరుల పిల్లలు వ్యాపారాలు చూసుకుంటున్నారని చెప్పారు. 

బౌధ్ డిస్టిలరీతోపాటూ సాహూకు చెందిన ఇతర వ్యాపార సంస్థలపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు డిసెంబర్ 6న మొదలెట్టిన రెయిడ్లు శుక్రవారంతో ముగిశాయి. ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించిన ఈ సోదాల్లో మొత్తం రూ. 353.5 కోట్లను ఐటీ అధికారులు జప్తు చేశారు. ఐటీ డిపార్ట్‌మెంట్ చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయిలో డబ్బు లభ్యం కావడం కలకలానికి దారి తీసింది. కాంగ్రెస్‌పై బీజేపీ  అవినీతి ఆరోపణల గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓ టీవీ షో ప్రస్తావనతో కాంగ్రెస్‌ను పరోక్షంగా ఎద్దేవా చేశారు. 


More Telugu News