విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • టీ20 వరల్డ్ కప్-2024లో ఇద్దరూ ఆడాలని అభిప్రాయపడ్డ మాజీ స్పిన్నర్
  • ఇద్దరిలో ఆడగలిగే సామర్థ్యం ఉందని వ్యాఖ్య
  • సీనియర్లు, సీనియర్ల కలయికతోనే జట్టు కూర్పు బాగుంటుందని సూచన
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో ఆడబోయే భారత జట్టులో సీనియర్లకు చోటు దక్కుతుందా లేదా అనే ఆసక్తికర చర్చ జరుగుతున్న వేళ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్ కప్‌లో విరాట్, రోహిత్ ఇద్దరూ ఉండాలని తాను భావిస్తున్నానని, యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా జట్టులో ఉంటేనే జట్టు కూర్పు బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. విరాట్, రోహిత్‌లకు ఆడగలిగే సత్తా ఉందని, అందుకే వారిద్దరు ఆడాలని సూచించాడు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ప్రస్తుత యువ జట్టులోని ఆటగాళ్లకు మరికొంత సమయం ఇస్తే నేర్చుకుంటారని హర్బజన్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఫలితాలను బట్టి జట్టుని జడ్జ్ చేయడాన్ని మానుకోవాలని, ఈ విషయంలో మార్పు రావాలని అన్నాడు. ఫలితాలకు సమయం పడుతుందని, టీమిండియా అదే ప్రక్రియలో ఉందని భజ్జీ విశ్వాసం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాలో ఆడటం అంత తేలికైన విషయం కాదని, ముఖ్యంగా బౌలర్లకు మరింత సవాలు అని అన్నాడు. దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా టీ20 సిరీస్‌పై ఈ విధంగా స్పందించాడు. ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంపై హర్భజన్ మాట్లాడుతూ.. ఫైనల్‌లో భారత్ కంటే ఆస్ట్రేలియా  మెరుగ్గా ఆడిందని అన్నాడు. ఫైనల్‌లో బాగా ఆడకపోవడం కారణంగా భారత్ ఓడిందని, ఆస్ట్రేలియా ధైర్యంగా ఆడిందని చెప్పాడు. టీమిండియా ఆటగాళ్లు ఒత్తిడిలో బాగా ఆడలేదని అంగీకరించాల్సిందేనని వ్యాఖ్యానించాడు.

కాగా విరాట్, రోహిత్ శర్మలకు టీ20 ఫార్మాట్‌లో ఇద్దరికీ ఉత్తమ గణాంకాలు ఉన్నాయి. విరాట్ 115 మ్యాచ్‌లలో 52.73 సగటుతో 4,008 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 122(నాటౌట్) కాగా స్ట్రైక్ రేట్ 137.96గా ఉంది. ఇక రోహిత్ శర్మ 31.32 సగటు, 139.24 స్ట్రైక్ రేట్‌తో 3,853 పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో రెండవ స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో రోహిత్ బెస్ట్ స్కోరు 118 కాగా ఈ ఫార్మాట్‌లో 4 సెంచరీలు, 29 అర్ధసెంచరీలు నమోదు చేశాడు.

కాగా గత ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌ సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన నాటి నుంచి రోహిత్, విరాట్ కోహ్లీ జట్టులో భాగస్వామ్యం కాలేదు. యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశాలు కల్పిస్తున్నారు.


More Telugu News