దీన్నే మాట తప్పడం అంటారు: పవన్ కల్యాణ్

  • అంగన్ వాడీ కార్యకర్తల సమ్మెకు జనసేన మద్దతు
  • ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలన్న పవన్ కల్యాణ్
  • విపక్ష నేతగా ఉన్నప్పుడు రూ.1000 ఎక్కువ ఇస్తామన్నారని వెల్లడి
  • అధికారంలోకి వచ్చాక రూ.1000 తక్కువగా ఇస్తున్నారని ఆరోపణ
రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులు చేపడుతున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే వేధింపులకు గురిచేస్తారా? అని ప్రశ్నించారు. 

అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే రూ.1000 ఎక్కువగా ఇస్తామని విపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చి... అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు తక్కువగా వేతనం ఇవ్వడాన్ని ఏమనాలి? అంటూ పవన్ కల్యాణ్ నిలదీశారు. దీన్నే మాట తప్పడం అంటారు అని ఎద్దేవా చేశారు. 

ఈ విషయాన్ని గుర్తు చేసేలా నిరసన తెలియజేస్తుంటే వేధింపులకు గురి చేయడం పాలకుల నైజాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. అంగన్ వాడీ కేంద్రాల తాళాలు బద్దలుకొట్టి పంచనామాలు చేస్తామని చిరుద్యోగులను బెదిరిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. 

"రాష్ట్రంలో 52 వేల అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష మందికి పైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామ మాత్రపు వేతనానికే పనిచేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం పెంచాలి. అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి వర్తింపజేయాలి. ఈ చిరుద్యోగుల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించాలి. అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ప్రకటిస్తోంది. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News