ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు నేటి నుంచి జీరో టికెట్స్

  • గురువారం రాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ‘జీరో టికెటింగ్’ విధానం
  • టిమ్ మెషిన్లలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన టీఎస్ఆర్టీసీ
  • ప్రయోగాత్మక పరిశీలన విజయవంతమవ్వడంతో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన విధానం
ఎన్నికల హామీల్లో భాగంగా ‘మహాలక్ష్మి’ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. కాగా గురువారం రాత్రి 12 గంటల నుంచి ‘జీరో టికెటింగ్’ విధానం అమ్లలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జీరో టికెట్లను జారీ చేయాలని ఆర్టీసీ అధికారులకు ఎండీ వీసీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని గురువారం రాత్రి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అది విజయవంతమవ్వడంతో అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు టికెట్లు జారీ చేసే టిమ్ మెషిన్లలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ప్రయాణించేది ఆర్డినరీ బస్సా లేక ఎక్స్‌ప్రెస్ బస్సా అనే వివరాలు ‘జీరో టికెట్’పై రికార్డ్ అవుతున్నాయి. బుధవారం రాత్రి నుంచే వీటి పనితీరుని పరిశీలించారు. కుషాయిగూడ, మిధాని సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా జీరో టికెటింగ్‌ను అమలు చేసి పరిశీలించారు. 

మరోవైపు రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. పండుగలు, జాతరల సమయాల్లో నడిపే బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపింది. వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు జీరో టికెట్‌‌పై ప్రయాణించవచ్చు. కొమురవెల్లి, నాగోబా వంటి జాతరలతోపాటు ప్రధానమైన పండుగలకు ప్రత్యేకంగా నడిపే సర్వీసుల్లో ఈ వెసులుబాటు మహిళలకు అందుబాటులో ఉంటుంది.


More Telugu News