శాంసంగ్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలు... వెంటనే అప్ డేట్ చేసుకోవాలన్న కేంద్రం

  • గెలాక్సీ ఎస్23, జెడ్ ఫోల్డ్-5, జెడ్ ఫ్లిప్-5 ఫోన్లలో లోపాలు
  • ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 వెర్షన్లు వాడుతున్న వారికి హెచ్చరిక
  • ఆయా ఫోన్లలోకి హ్యాకర్లు ప్రవేశించే వీలుందన్న సీఈఆర్టీ-ఇండియా
మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైబర్ వ్యవహారాల సంస్థ సీఈఆర్టీ-ఇండియా శాంసంగ్ ఫోన్లలో భద్రతా పరమైన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. 

ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 వెర్షన్లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని వెల్లడించింది. ఆయా వెర్షన్లతో ఆండ్రాయిడ్ ఓఎస్ ను వినియోగిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ జెడ్ ఫోల్డ్-5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోన్ల సొంతదారులు వెంటనే ఓఎస్ ను లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ తో అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ-ఇండియా సూచించింది. 

శాంసంగ్ ఫోన్లలో ఉండే నాక్స్ సెక్యూరిటీ సిస్టమ్ లో లోపాలు ఉన్నాయని, నాక్స్ ఫీచర్లపై నియంత్రణ లోపించిందని, లోపాలు సరిదిద్దకపోవడంతో అది ఫోన్ భద్రతకే ముప్పు కలిగించే పరిస్థితికి దారితీసిందని వివరించింది. హ్యాకర్లు సులువుగా శాంసంగ్ ఫోన్లలోకి ప్రవేశించే వీలుందని సీఈఆర్టీ-ఇండియా హెచ్చరించింది. 

అంతేకాకుండా, శాంసంగ్ ఫోన్లలోని ఏఆర్ ఎమోజీ యాప్ లోనూ అథెంటికేషన్ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు కేంద్రం గుర్తించింది. ఇది కూడా హ్యాకర్ల పని సులువు చేస్తుందని తెలిపింది. 

ఆయా వెర్షన్ల ఓఎస్ ను వాడుతున్న శాంసంగ్ ఫోన్ల సొంతదారులు వెంటనే ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అబౌట్ డివైస్ ను క్లిక్ చేయాలని, అందులోని లేటెస్ట్ సాఫ్ట్ వేర్ వెర్షన్ తో తమ ఫోన్ ను అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ-ఇండియా సూచించింది.


More Telugu News