రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ

  • రుషికొండ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమంటూ పిటిషన్
  • ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి
  • రుషికొండ తవ్వకాలపై నేడు కేంద్ర బృందం పరిశీలన
  • ఉల్లంఘనల ఆధారాలను కేంద్ర బృందానికి పంపాలన్న హైకోర్టు
విశాఖలోని రుషికొండపై నిబంధనలను అతిక్రమించి తవ్వకాలు, నిర్మాణాలు జరుపుతున్నారంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. రుషికొండపై అన్ని అంశాలను కేంద్ర బృందం పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలని 'జనసేన' మూర్తి తన పిటిషన్ లో కోరారు. 

విచారణ సందర్భంగా... రుషికొండపై అక్రమంగా బోర్లు వేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొండపై తవ్విన గ్రావెల్ ను సముద్ర తీరంలో పడేశారని ఆరోపించారు. రుషికొండపై నిర్మాణాలను ఇవాళ కేంద్ర బృందం పరిశీలిస్తోందని వివరించారు. 

అందుకు జడ్జి స్పందిస్తూ, ఉల్లంఘనల ఫొటోలను కేంద్ర బృందానికి పంపాలని పిటిషనర్ ను ఆదేశించారు. 

రుషికొండపై నిర్మాణాలు జరుగుతున్నాయన్న పిటిషన్లపై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు... పరిశీలన జరిపి నివేదిక అందించాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల ప్రత్యేక బృందం ఏర్పాటైంది.


More Telugu News