లోక్ సభలో దాడి ఘటనకు సంబంధించి ఎనిమిది మంది భద్రతా సిబ్బందిపై వేటు
- లోక్ సభలో కలర్ గ్యాస్ ను విడుదల చేసిన దుండగులు
- భద్రతా వైఫల్యంపై దేశ వ్యాప్తంగా కలకలం
- భద్రతా వైఫల్యంపై పార్లమెంటులో గందరగోళం సృష్టించిన విపక్షాలు
పార్లమెంటులో నిన్న భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. లోక్ సభలో ఇద్దరు దుండగులు కలకలం రేపారు. జీరో అవర్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి హౌస్ లోకి దూకిన సాగర్ శర్మ, మరోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు సభలో గందరగోళం సృష్టించారు. వారి వెంట తెచ్చుకున్న డబ్బాల నుంచి కలర్ గ్యాస్ ను విడుదల చేశారు. ఇదే సమయంలో పార్లమెంటు వెలుపల మరో ఇద్దరు రంగు వాయువులను వెదజల్లుతూ నినాదాలు చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, ఎనిమిది మంది భద్రతా సిబ్బందిని లోక్ సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది. భద్రతా లోపాల కారణంగా వీర్ దాస్, గణేశ్, అరవింద్, రాంపాల్, అనిల్, విమిత్, పర్దీప్, నరేందర్ లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు పార్లమెంటులో భద్రతా లోపాలపై ఈరోజు విపక్షాలు గందరగోళం సృష్టించాయి.